సిద్దిపేట రూరల్, వెలుగు: సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మాచాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట–ముస్తాబాద్ రోడ్డుపై నిరసన తెలిపారు.
రంగనాయకసాగర్ నుంచి 7, 8 నంబర్ కాలువలకు మాత్రమే నీరు వెళ్తోందని, 9వ కాలువ వద్దకు మాత్రం చాలా తక్కువగా నీరు వస్తోందని రైతులు తెలిపారు. దీంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని వాపోయారు.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. రెండు మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రూరల్ పోలీసులు, సాగునీటి శాఖ అధికారులు రైతులను సముదాయించడంతో వారు నిరసన విరమించారు.
